వరద పరిస్థితులపై హోం మంత్రి సమీక్ష
అంతటా అప్రమత్తంగా ఉండాలని ఆదేశం
అమరావతి – మరోసారి బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాష్ట్ర వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ఏపీ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. విషయం తెలుసుకున్న రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత హుటా హుటిన వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్బంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
శుక్రవారం తాడేపల్లి గూడెంలోని డిజాస్టర్ మేనేజ్ మెంట్ కార్యాలయంలో గోదావరికి పెరుగుతున్న నీటి మట్టం, కృష్ణా నది నీటిమట్టంతో పాటు బుడమేరు వాగు వద్ద పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు వంగలపూడి అనిత.
ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నీటిమట్టం పెరుగుతున్న దృష్ట్యా మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయడం జరిగిందన్నారు. గోదావరి నది ప్రభావిత 6 జిల్లాల అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని ఈ సందర్బంగా వంగలపూడి అనిత చెప్పారు.
తీసుకోవల్సిన జాగ్రత్తలపై అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని అన్నారు హోం శాఖ మంత్రి. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వంగలపూడి అనిత కోరారు. ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని తెలిపారు.