అసెంబ్లీలో మంత్రి వంగలపూడి అనిత ప్రకటన
అమరావతి – పని చేసే ప్రదేశాలలో మహిళల భద్రత కోసం 2013 పీఓఎస్‌హెచ్ చట్టం అమలు చేస్తున్నామని చెప్పారు మంత్రి వంగలపూడి అనిత. మండలిలో వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. 2019 -24 వరకు 85 కేసులు నమోదైనట్లు తెలిపారు. 41ఎ సీఆర్ పీసీ/35(3) కింద 72 నోటీసులు జారీ చేశామన్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు 24 మందిని అరెస్ట్ చేయడం జరిగిందన్నారు మంత్రి.
2024లో 30 కేసులు నమోదయ్యాయని, ,41ఎ సీఆర్ పీసీ/35(3) కింద 23 మందికి బీఎన్ఎస్ఎస్ నోటీసులు జారీ చేశామన్నారు. ఈ కేసుకు సంబంధించి 5 మందిని అరెస్ట్ చేయడం జరిగిందన్నారు మంత్రి వంగలపూడి అనిత.
రాష్ట్రంలోని జిల్లాల్లో 6,681 అంతర్గత కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందులో జిల్లా స్థాయి స్థానిక ఫిర్యాదు కమిటీత పాటు అంతర్గత ఫిర్యాదు కమిటీ ఉంటుందన్నారు. 2024 సెప్టెంబర్ నుంచి 2025 జనవరి వరకు ఆయా కమిటీలకు 50 ఫిర్యాదులు అందాయని చెప్పారు మంత్రి.
ప్రతి 10 మంది మహిళా ఉద్యోగులున్న చోట కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రతి జిల్లాలో జిల్లా అధికారిగా జిల్లా కలెక్టర్ నియామకం, అన్ని ఫిర్యాదుల కమిటీల్లో 50 శాతం మహిళల ప్రాతినిధ్యం ఉండేలా చేశామన్నారు.