వినాయక చవితి కోసం ప్రత్యేక యాప్
ప్రకటించిన ఏపీ మంత్రి వంగలపూడి
విశాఖపట్నం – ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత కీలక ప్రకటన చేశారు. సెప్టెంబర్ 1 నుంచి వినాయక చవితి పండుగ సందర్బంగా ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. కొన్ని చోట్ల 5 రోజులు మరికొన్ని చోట్ల 7 రోజుల పాటు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
దీనిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని వెల్లడించారు వంగలపూడి అనిత. సర్క్యూట్ హౌస్ లో వినాయక చవితి ఉత్సవాలపై సమీక్ష చేపట్టారు. వినాయక చవితి ఉత్సవాలు సింగిల్ విండో విధానంలో అనుమతులు ఇస్తున్నామని తెలిపారు.
మొబైల్ ఫోన్ ద్వారా ఉత్సవాలకు అనుమతులు పొందవచ్చని స్పష్టం చేశారు వంగలపూడి అనిత. ఇవాల్టి నుంచి యాప్ అందుబాటులోకి వస్తుందని చెప్పారు.
ఈ యాప్ లో ఉత్సవాలకు సంబంధించి వివరాలు నమోదు చేయాలని, ఆ తర్వాత అన్ని విభాగాల అధికారులు పరిశీలించి పర్మిషన్ ఇవ్వాలా వద్దా అనేది నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. ఉత్సవాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటారని, ప్రజలు సహకరించాలని కోరారు హోం శాఖ మంత్రి.