జగన్ పులకేసిలా మాట్లాడితే ఎలా..?
నిప్పులు చెరిగిన హోం శాఖ మంత్రి
అమరావతి – ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఏకి పారేశారు రాష్ట్ర హొం శాఖ మంత్రి వంగలపూడి అనిత. శనివారం ఆమె మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. జగన్ రెడ్డి కల్తీపై మాట్లాడమంటే పులకేసిలా వ్యవహరిస్తున్నాడంటూ ఎద్దేవా చేశారు. ఆయనకు పులకేసి 3 లేదా 4 అని పేరు పెట్టాలన్నారు. కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు దళితులను తెర పైకి తీసుకు వస్తున్నాడని ఆరోపించారు . జగన్ ఎన్ని వేషాలు వేసినా జనం నమ్మరని అన్నారు.
టీడీపీ హయాంలోనే దళితులకు టీటీడీ బోర్డులో మెంబర్లు గా నియమించడం జరిగిందని, కానీ జగన్ ఒక్కరినైనా నియమించాడా అని ప్రశ్నించారు వంగలపూడి అనిత. ఆయనకు హిందుత్వంపై నమ్మకం లేదన్నారు. ఆయనను తిరుమలకు వెళ్లకుండా ఎవరూ అడ్డుకోలేదని చెప్పారు. తనంతకు తానుగా ఓ ప్లాన్ వేశాడని, తమపై దుష్ప్రచారం చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు.
డిక్లరేషన్ పై సంతకం చేయాల్సి వస్తుందని జగన్ రెడ్డి కొత్త నాటకానికి తెర లేపాడని ఆరోపించారు.సెక్షన్ 30 అనేది కామన్ గా శాంతి భద్రతల పరిరక్షణ కోసం అమలు చేస్తారని అన్నారు. తాను హిందువునని ధైర్యంగా చెబుతున్నానని, మరి జగన్ అలా చెప్పగలడా ఆ దమ్ముందా అని నిలదీశారు వంగలపూడి అనిత. ఇదేం దేశమని మాట్లాడుతున్న జగన్ రెడ్డిపై దేశ ద్రోహం కేసు పెట్టాలని, తరిమి కొట్టాలని సంచలన కామెంట్స్ చేశారు హోం శాఖ మంత్రి.
తిరుమలకు వస్తానన్న జగన్ రెడ్డి కుంటి సాకులతో ఆగి పోయాడని అన్నారు. 10 వేల మందితో తిరుమలకు జగన్ రెడ్డి వస్తారన్న విస్తృత ప్రచారం సోషల్ మీడియాలో జరిగిందన్నారు.. వారి పర్యటనను అడ్డుకుంటామని ప్రజా సంఘాలు, ధార్మిక సంఘాలు ప్రకటించాయని అన్నారు.
జగన్ రెడ్డిని సూటిగా అడుగుతున్నా.. ఒక్క నాయకున్ని అయినా హౌస్ అరెస్ట్ చేశామా..? ఒక్క నాయకున్ని అయినా ప్రివెంటీవ్ అరెస్ట్ చేశామా? ఒక్క నాయకుడి ఇంటి దగ్గరైనా పోలీసుల పహారా పెట్టామా? ఎక్కడే గాని పోలీసులు భారీగా మోహరించిన పరిస్థితి లేదన్నారు. వైసీపీ నేతలు భారీగా జనసమీకరణ చేసేందుకు ప్లాన్ చేసుకోవడం, ధార్మిక సంఘ నేతలు జగన్ రెడ్డిని అడ్డుకుంటామని చెప్పడంతోనే బ్రహ్మోత్సవాలకు, భక్తులకు ఇబ్బంది కలగ కూడదని సెక్షన్ 30 నోటీసులు ఇచ్చారని చెప్పారు వంగలపూడి అనిత.