బాబు కోసం జగన్ పై ఆరోపణలా..?
షర్మిలపై వరుదు కళ్యాణ్ ఫైర్
విశాఖపట్నం – వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి నిప్పులు చెరిగారు. ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డిని ఏకి పారేశారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం అలవాటుగా మారిందన్నారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును కాపాడేందుకు తన స్వంత సోదరుడైన వైసీపీ బాస్ , మాజీ సీఎం జగన్ రెడ్డిని టార్గెట్ చేయడం ఎంత వరకు సబబు అంటూ ప్రశ్నించారు వరుదు కళ్యాణి. ఇది మంచి పద్దతి కాదన్నారు.
కేవలం చంద్రబాబుని కాపాడడం కోసం, డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఇంత ఆరోపణలు చేయాలా , మరీ ఇంతలా దిగ జారి పోవాలా అని ప్రశ్నించారు వరుదు కళ్యాణి. మీ జెండా, అజెండా అంతా బాబు కోసమేనా అని నిలదీశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వని అధికారంలో ఉన్న బాబును, కూటమి సర్కార్ ను ప్రశ్నించాల్సింది పోయి, సంపూర్ణ ఫీజురీయింబర్స్‌మెంట్ ఇచ్చిన జగన్ రెడ్డిపై విమర్శలు చేస్తే ఎలా అని నిప్పులు చెరిగారు వైసీపీ మహిళా నాయకురాలు.
అఘాయిత్యాలకు ఆడపిల్లలు బలై పోతుంటే మీరు నోరు ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. దివంగత మహానేత వైయస్‌ఆర్ ప్రవేశపెట్టిన ఫీజురీయింబర్స్‌మెంట్‌కు మరింత వన్నెలద్ది దాన్ని పటిష్టంగా జగన్ మోహన్ రెడ్డి అమలు చేశారని , ఆ విషయం తెలుసుకోకుండా మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు వరుదు కళ్యాణి.
గత చంద్రబాబు ప్రభుత్వం బకాయి పెట్టిన రూ.1778 కోట్లను చెల్లించడంతో పాటు, విద్యా దీవెన, వసతి దీవెనల కింద మొత్తంగా రూ.18,663 కోట్లు చెల్లించి విద్యార్థులకు, పేద కుటుంబాలకు అండగా నిలిచారని గుర్తు చేశారు.