కాషాయానికి ‘వరుణ్’ క్వశ్చన్ మార్క్
మోదీ..అమిత్ షా.నడ్డాకు బిగ్ షాక్
ఇద్దరు గాంధీలు ఈ దేశంలో చర్చనీయాంశంగా మారారు. ఇద్దరూ ఒకే కుటుంబానికి చెందిన వారు. కానీ విభిన్నమైన భావాలు కలిగిన వారు. ఇద్దరూ తమ తమ పద్దతుల్లో ప్రజల కోసం పని చేస్తున్న వారే. ఇద్దరి వాయిస్ ఒక్కటే. జనం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తున్నారు. నిలదీస్తున్నారు..నిగ్గదీసి కడిగి పారేస్తున్నారు. ఆ ఇద్దరూ ఎవరో కాదు స్వయాన అన్నదమ్ములు. ఇద్దరూ ఎంపీలు. ఒకరు మాజీ మంత్రి మరొకరు వాయనాడు ఎంపీ. యూపీ నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వరుణ్ గాంధీ నిత్యం ఆ పార్టీని ప్రశ్నిస్తున్నారు. ఒక రకంగా దేశంలో ఆక్టోపస్ లా విస్తరించుకుంటూ పోయిన కాషాయ పరివారంలో కంట్లో నలుసుగా మారాడు.
ప్రపంచంలో మోస్ట్ పవర్ ఫుల్ లీడర్ గా భారత దేశాన్ని నడిపిస్తున్న నాయకుడిగా పేరొందిన నరేంద్ర దామోదర దాస్ ను పార్టీకి చెందిన ఎంపీ వరుణ్ గాంధీ నిలదీస్తున్నాడు. అంతే కాదు రైతుల ఆందోళనకు మద్దతు ప్రకటించాడు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఏవీ అంటూ నిలదీశాడు. అంకెలతో సహా ఆధారాలతో ముందుంచాడు కేంద్ర ప్రభుత్వం ముందు. మహామహులు, తలపండిన రాజకీయ నాయకులు మోదీ ముందు మోకరిల్లుతుంటే, బీజేపీలో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన నేతలు చడీ చప్పుడు కాకుండా తప్పుకుంటే.. కేంద్ర మంత్రులు సైతం జీ హుజూర్ అని కీర్తిస్తుంటే ఒక్కడు వరుణ్ గాంధీ మాత్రం మాటలతో మంటలు రేపుతున్నాడు.
బీజేపీ హైకమాండ్ ఇద్దరి విషయంలో ఏమీ చేయలేక పోతోంది. ఒకరు వరుణ్ గాంధీ కాగా మరొకరు మణిపాల్ గవర్నర్ సత్యపాల్ మాలిక్. ఇద్దరూ బీజేపీలో ఇప్పుడు మోస్ట్ డేంజరస్ పీపుల్ గా పేరొందారు. ఇది పక్కన పెడితే వరుణ్ గాంధీకి రాజకీయం తెలియదని అనుకుంటే పొరపాటు పడినట్లే. ఇంకొకరైతే ఈపాటికీ కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులకు గురయ్యేవారు. కానీ మనోడు దమ్మున్నోడు. అంతే కాదు నేను తప్పు చేయను..ఎవ్వరికీ లొంగను అంటూ ప్రకటించాడు. వరుణ్ గాంధీ ధిక్కార స్వరం వినిపించేందుకు కావాల్సిన శక్తి ప్రజలు ఇచ్చిందేనని స్పష్టం చేశాడు.
ఈ దేశం పట్ల మమకారం ఉంది. అంతకు మించిన దేశభక్తి కూడా ఉంది. దేశం అంటే అంబానీ, అదానీ, టాటాలు కాదని సమస్త ప్రజలు అని గతంలోనే స్పష్టం చేశాడు ఈ యువ ఎంపీ. ఇదే సమయంలో గ్రామాలను ఆర్థికంగా బలోపేతం చేయనంత వరకు దేశం బాగుపడదని ఇప్పటికే పలుమార్లు హెచ్చరించారు. గుడ్ పార్లమెంటేరియన్ మాత్రమే కాదు మంచి రచయిత కూడా వరుణ్ గాంధీ. ఇప్పటికే రూరల్ ఎకానమీ మీద తన అభిప్రాయాలను పంచుకుంటూ పుస్తకం రాశాడు. తాజాగా మరో బుక్ ను రిలీజ్ చేశాడు. ఇందులో కూడా కీలకమైన వ్యాఖ్యలు చేశాడు వరుణ్ గాంధీ. ఆయన రాసిన పుస్తకం పేరు ది ఇండియన్ మెట్రోపాలిస్. ఇది రాసేందుకు మూడేళ్లు పట్టిందన్నాడు ఎంపీ.
పట్టణాల్లో భారతీయులు ఎదుర్కొంటున్న సమస్యలను మానవతా దృక్పథంతో టచ్ చేశాడు. ఇప్పటి వరకు నాలుగు పుస్తకాలు రాశాడు. లాక్ డౌన్ విపత్కర సమయంలో చోటు చేసుకున్న పరిణామాల గురించి ప్రస్తావించాడు. ఈ నగరాలు, అందమైన భవంతులు సామాన్యులకు బతికేందుకు భరోసా కాక పోయినా కనీసం నీడనైనా ఎందుకు ఇవ్వలేక పోతున్నాయంటూ ప్రశ్నించాడు.
గాలీ, నీళ్లు కలుషితం కావడానికి పాలకులు కాదా కారణం అని నిలదీశాడు వరుణ్ గాంధీ. 42 ఏళ్ల ఎంపీ లేవదీసిన ప్రశ్నలు కేంద్రంలో కొలువుతీరిన మోదీకి అర్థమైతే బావుండు. కదూ.