ఘనంగా శ్రీపద్మావతి బ్రహ్మోత్సవాలు
తిరుపతి – తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మ వారి కార్తీక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా వసంతోత్సవం వైభవోపేతంగా వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా అమ్మ వారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు.
బ్రహ్మోత్సవాల్లో ఉదయం, సాయంత్రం వాహనసేవల్లో పాల్గొని అలసి పోయిన అమ్మ వారికి ఉపశమనం కల్పించేందుకు వసంతోత్సవం నిర్వహించారు. దీనిని ఉపశమనోత్సవం అని కూడా అంటారు. వసంతోత్సవంలో భాగంగా చందనంతో పాటు పలురకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో అమ్మ వారికి విశేషంగా అభిషేకం చేశారు.
అనంతరం చల్లదనం కోసం చందనం జలాన్ని మాడ వీధుల్లో భక్తులు ఒకరిపై ఒకరు చల్లుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు, అర్చకులు ఉత్సాహంగా భక్తులపై వసంతాలు చల్లారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో గోవింద రాజన్, ఆలయ అర్చకులు బాబు స్వామి, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.