వైఎస్ జగన్ లీడర్ కాదు మోనార్క్ – వాసిరెడ్డి పద్మ
వైఎస్సార్సీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటన
అమరావతి – మాజీ ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఈ మేరకు బుధవారం ఆమె మీడియాతో మాట్లాడారు. తాను ఇక ఆ పార్టీలో ఉండదల్చు కోలేదని ప్రకటించారు. ఇదే సమయంలో వైసీపీ బాస్, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. ఆయన లీడర్ కాదని , ఓ మోనార్క్ అంటూ మండిపడ్డారు.
తాను మహిళా చైర్ పర్సన్ గా ఉండగా అనేక విషయాలు ఆనాడు ప్రభుత్వం ముందు పెట్టినా, ప్రస్తావించినా పట్టించు కోలేదని, చూసీ చూడనట్లు వ్యవహరించాలని చెప్పారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు వాసిరెడ్డి పద్మ.
మహిళల విషయంలో ఇప్పుడు జగన్ రెడ్డి రాజకీయం చేస్తున్నాడని ఆరోపించారు. జగన్ రెడ్డి పాలన ఏమైనా మహిళలకు స్వర్ణ యుగమా అని ప్రశ్నించారు. రోజుకో వికృతమైన ఘటన నాడు మహిళల పై జరిగినా, ఏ నాడు జగన్ రెడ్డి బయటకు రాలేదన్నారు. ఒక్కరిని కూడా పరామర్శించిన పాపాన పోలేదన్నారు వాసిరెడ్డి పద్మ.
పార్టీలో కష్టపడిన వారి కోసం ఇప్పుడు జగన్ ‘గుడ్ బుక్’ ప్రమోషన్లు అంటున్నారని, కానీ నాయకులు, కార్యకర్తల కోసం ఉండాల్సింది ‘గుడ్ బుక్’ కాదు “ గుండె బుక్ ” అని అన్నారు. రాజకీయ పార్టీ అనే విషయం మరిచి పోయారని, ఫక్తు కంపెనీ లాగా వ్యవహరించడం సబబు కాదన్నారు.
పార్టీని నడిపించడంలో కానీ, పాలించడంలో కానీ బాధ్యత లేదన్నారు. అంత కంటే ఎక్కువగా సమాజం పట్ల ప్రేమ కూడా లేదన్నారు వాసిరెడ్డి పద్మ.
వ్యక్తిగతంగా, విధానాల పరంగా అనేక సందర్భాల్లో అసంతృప్తి ఉన్నప్పటికీ ఒక నిబద్ధత కలిగిన నాయకురాలిగా పార్టీలో పని చేశానని చెప్పారు. ప్రజాతీర్పు తర్వాత అనేక విషయాలు సమీక్షించుకుని అంతర్మధనం చెంది వైసీపీని వీడాలని నిర్ణయం తీసుకున్నానని అన్నారు వాసిరెడ్డి పద్మ.