Wednesday, April 23, 2025
HomeDEVOTIONALశ్రీ ప‌ద్మావ‌తి అమ్మ వారికి ప‌ట్టు వ‌స్త్రాల స‌మర్ప‌ణ

శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ వారికి ప‌ట్టు వ‌స్త్రాల స‌మర్ప‌ణ

స‌మ‌ర్పించిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రెడ్డి
తిరుప‌తి – తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మ వారి కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అమ్మ వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయానికి చేరుకున్న మంత్రివర్యులకు టిటిడి ఈవో శ్యామల రావు, జేఈవోలు వీరబ్రహ్మం, గౌతమి, సివి అండ్ ఎస్వో శ్రీధర్, ఆలయ అర్చకులు, అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అమ్మ వారి దర్శనానంతరం ప్రసాదాలు అందజేశారు.

అనంతరం మంత్రివర్యులు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించడం తన పూర్వ‌జ‌న్మ సుకృతంగా భావిస్తున్నట్టు చెప్పారు. ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలియజేశారు.

అందరిలో ఒకరిగా అమ్మ వారి దర్శనం చేసుకునే నేను, పట్టు వస్త్రాలు సమర్పించే ఘటనలను టీవీల్లో చూడడం, పత్రికల్లో చదవడమో చూశా, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తరుపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించే అవకాశం రావడం తల్లిదండ్రుల పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నా అని అన్నారు.

ఈ అవకాశం ఇచ్చిన సీఎంకు రుణపడి ఉన్నానని అన్నారు. తిరుమలలో శ్రీవారి నేత్ర దర్శనం చేసుకోవడం, అదే రోజున శ్రీ పద్మావతీ అమ్మ వారికి పట్టువస్త్రాలు సమర్పించడం ఆనందంగా ఉందన్నారు.

బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్భంగా భ‌క్తుల కోసం టీటీడీ అన్ని వ‌స‌తులు క‌ల్పించింద‌న్నారు. రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురిసి సస్య శ్యామలంగా ఉండాలని, రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మ వారిని ప్రార్థించినట్టు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో గోవింద‌రాజ‌న్‌, విజివో సదాలక్ష్మి, ఏవీఎస్వో వై. సతీష్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments