ఆర్టీసీలో ప్రతిరోజూ జాతీయ గీతం
స్పష్టం చేసిన ఎండీ వీసీ సజ్జనార్
హైదరాబాద్ – టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు శుక్రవారం ట్విట్టర్ వేదికగా ఆయన కీలక ప్రకటన చేశారు. ఇక నుంచి జనవరి 26, ఆగస్టు 15న కాకుండా ప్రతి రోజూ ఆర్టీసీ సంస్థలో విధిగా జాతీయ గీతాన్నా ఆలాపించడం జరుగుతుందని స్పష్టం చేశారు.
దేశానికి చెందిన ఈ గీతం ప్రతి రోజూ ప్రతిధ్వనించాలని పేర్కొన్నారు. జన గణ మన అనేది గీతం కాదని అది భారత దేశ సంస్కృతి, నాగరికతకు, ఆత్మ గౌరవానికి సంబంధించినదని తెలిపారు వీసీ సజ్జనార్. అంతే కాకుండా భారతదేశ వైవిధ్యం, సమగ్రతను నొక్కి చెప్పిందని తెలిపారు.
ఒకరి నేపథ్యం లేదా నమ్మకాలతో సంబంధం లేకుండా ప్రతిరోజూ దీనిని పాడటం ద్వారా, వ్యక్తులు భిన్నత్వంలో సమానత్వం , ఏకత్వం అనే సూత్రాలకు తమ నిబద్ధతను ధృవీకరిస్తారని స్పష్టం చేశారు. జాతీయ గీతాన్ని ఆలపించడాన్ని రోజు వారీ దిన చర్యలలో చేర్చడం వల్ల క్రమశిక్షణ, క్రమ భావన పెరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు వీసీ సజ్జనార్.
75వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా “ఆజాదీ కా అమృత్ మహొత్సవ్” వేడుకలు ప్రారంభమైనప్పటి నుండి తాము టీఎస్ఆర్టీసీలో ప్రతి రోజూ ఉదయం 11 గంటలకు జాతీయ గీతాన్ని క్రమం తప్పకుండా ఆలాపిస్తూ వస్తున్నామని తెలిపారు.