విద్యార్థులకు బస్సులు ఉచితం
మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం నుంచి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కావడంతో విద్యార్థులకు ఉపయోగకరంగా ఉండేలా ఆర్టీసీ పెద్ద ఎత్తున బస్సులను ఏర్పాటు చేసిందని తెలిపారు. ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించారు.
పరీక్షల సందర్బంగా 10వ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థిని, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులకు రవాణా విషయంలో అసౌకర్యం కలగకుండా టీఎస్ఆర్టీసీ యాజమాన్యం అన్ని ఏర్పాట్లు చేసిందని తెలిపారు.
తెలంగాణ విద్యా శాఖ సూచనల మేరకు పరీక్షా కేంద్రాల వద్దకు విద్యార్థులు ఉదయం 8.45 గంటలకు చేరుకునేలా ప్రత్యేక బస్సులను నడుపుతోందని స్పష్టం చేశారు. మార్చి 18 నుంచి వచ్చే నెల ఏప్రిల్ 2వ తేదీ వరకు బస్సులు నడిపిస్తామని స్పష్టం చేశారు వీసీ సజ్జనార్.
మహాలక్ష్మి పథకం నేపథ్యంలో విద్యార్థినిలకు ప్రయాణం ఫ్రీ కాగా.. విద్యార్థులు తమ దగ్గర ఉన్న పాత బస్ పాస్, హాల్ టికెట్ చూపించి పరీక్షా కేంద్రం వరకు ఉచితంగా ప్రయాణించవచ్చని సూచించారు ఎండీ . ఎక్స్ ప్రెస్ బస్సుల్లో కాంబినేషన్ టికెట్ సదుపాయం కూడా అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు వెల్లడించారు. ఒత్తిళ్లకు లోను కాకుండా పరీక్షలు రాయాలని సూచించారు.