జగన్ పై దాడి బాబు పనే
వెల్లంపల్లి శ్రీనివాస్
విజయవాడ – టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడిపై సంచలన ఆరోపణలు చేశారు విజయవాడ సెంట్రల్ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్. సర్వేలన్నీ ఏపీలో తిరిగి జగన్ మోహన్ రెడ్డి సీఎం అవుతారని పేర్కొంటున్నాయని అన్నారు. దీనిని తట్టుకోలేని చంద్రబాబు నాయుడు చిల్లర రాజకీయాలు చేస్తున్నాడని ధ్వజమెత్తారు.
ఇవాళ విజయవాడలో తన కోసం మద్దతు తెలిపేందుకు ఏపీ సీఎం జగన్ రెడ్డి స్వయంగా బస్సు యాత్ర చేపట్టారని తెలిపారు. ఇందులో భాగంగా గుర్తు తెలియని వ్యక్తి రాయి విసిరాడని, దీంతో జగన్ రెడ్డి తలకు బలమైన గాయమైందని పేర్కొన్నారు వెల్లంపల్లి శ్రీనివాస్.
చంద్రబాబు నాయుడు ప్రత్యక్షంగా రాజకీయంగా జగన్ మోహన్ రెడ్డిని ఎదుర్కోలేక దొడ్డి దారిన దాడి చేయించాడని సంచలన ఆరోపణలు చేశారు. ఇలాంటి హత్యా రాజకీయాలకు చంద్రబాబు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు వైసీపీ అభ్యర్థి. ప్రస్తుతం దేవుడి దయ వల్ల తమ నాయకుడు బతికి బయట పడ్డాడని తెలిపారు.
ఇలాంటి దాడుల వల్ల తాము భయపడే ప్రసక్తే లేదన్నారు. తాము అమలు చేసిన సంక్షేమ పథకాలే తమను గట్టెక్కిస్తాయని, ఆ నమ్మకంతోనే తమ పార్టీ చీఫ్ వై నాట్ 175 అన్న నినాదంతో ముందుకు వెళుతున్నారని చెప్పారు వెల్లంపల్లి శ్రీనివాస్.