టీటీడీ జేఈవోగా వెంకయ్య చౌదరి
నియమించిన రాష్ట్ర ప్రభుత్వం
తిరుమల – ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీఎంగా కొలువు తీరిన నారా చంద్రబాబు నాయుడు తన టీంను ఎంపిక చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే పలు శాఖలకు సంబంధించి కీలకమైన ఉన్నతాధికారులను మార్చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) ఈవోగా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ జె. శ్యామల రావును నియమించారు.
ఇదే సమయంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. జేఈవోగా నూతనంగా ఏపీకి చెందిన చిరుమామిళ్ల వెంకయ్య చౌదరిని నియమించారు. ఇదిలా ఉండగా వెంకయ్య చౌదరి 2005 సంవత్సరానికి సంబంధించిన ఐఆర్ఎస్ అధికారి.
ఆయనను డిప్యూటేషన్ పై పంపించాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం విన్నవించింది. ఈ మేరకు కేంద్రం ఆమోదం తెలిపింది. వెంకయ్య చౌదరి మూడు సంవత్సరాల పాటు పని చేయనున్నారు జేఈవోగా.
కాగా గతంలో వెంకయ్య చౌదరి ఏపీ మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ గా, మేనేజింగ్ డైరెక్టర్ గా పని చేశారు. మరో వైపు 37 మంది ఐపీఎస్ లను బదిలీ చేస్తూ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. మరికొందరి అధికారులకు స్థాన చలనం కలగనున్నట్టు సమాచారం.