ఆత్మ బంధువుని కోల్పోయా
వెంకయ్య భావోద్వేగం
హైదరాబాద్ – ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు కన్నీటి పర్యంతం అయ్యారు. చెరుకూరి రామోజీరావు మరణం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. రామోజీ ఫిలిం సిటీలో ఆయన పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు వెంకయ్య నాయుడు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
ఆత్మ బంధువును కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యం ఉషోదయంతో అక్షర కిరణాలను తెలుగు లోగిళ్ళకు పంపి, సమాజాన్ని జాగృతం చేసిన అక్షర క్రాంతి రామోజీరావు అని కొనియాడారు. వారి ప్రతి మాట, ప్రతి చేత సమాజం పక్షమే వహించిందన్నారు.
సరైన సమయంలో దిశానిర్దేశం చేసిందన్నారు. సామాజిక జాఢ్యాల మీద పోరాటం చేసిందని. సమ సమాజ నిర్మాణం దిశగా జాతిని జాగృతం చేసిన ఘనత ఆయనదేనని పేర్కొన్నారు వెంకయ్య నాయుడు. భౌతికంగా దూరమైనా, రామోజీరావు నిర్మించిన బాటలు భవిష్యత్ తరాలను ప్రభావవంతమైన మార్గంలో ముందుకు నడుపుతూనే ఉంటాయని స్పష్టం చేశారు.
వ్యాపారం రంగంలో రామోజీ రావు నూతన ఆలోచనా విధానాలు, పాటించిన విలువలు సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టాయన్నారను. అమ్మకాలు, కొనుగోళ్లు మాత్రమే కాదు అంతకు మించిన సామాజిక బాధ్యతను గుర్తు చేశాయని తెలిపారు.
తెలుగు సినిమా రంగానికి విలువల దివిటీ పట్టి వారు చూపించిన నూతన మార్గం ఎంతో మంది నూతన నటీ నటులకు, సాంకేతిక నిపుణులకు కొత్త జీవితాన్ని ఇచ్చేలా చేసిందన్నారు. కళాత్మక వ్యాపారమైన సినిమాలకు, సామాజిక బాధ్యతను జోడించి చేసిన ప్రయోగాలు ప్రేక్షక జన నీరాజనాలు అందుకున్నాయని తెలిపారు. భారతదేశ పత్రిక, సినిమా రంగాల్లో ఆయన కీర్తి అజరామరమని కొనియాడారు.