నిప్పులు చెరిగిన వెన్నెల గద్దర్
హైదరాబాద్ – కేంద్ర మంత్రి బండి సంజయ్ పై సీరియస్ అయ్యారు తెలంగాణ సాంస్కృతిక సమితి చైర్ పర్సన్ వెన్నల గద్దర్. తన తండ్రి గద్దర్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. తెలంగాణ అంటేనే గద్దర్ అని, ఆయన తన చివరి శ్వాస వరకు ప్రజల కోసం పోరాడారని అన్నారు.
ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన గద్దరన్న ఎక్కడ నువ్వెక్కడ అంటూ నిప్పులు చెరిగారు. పదవుల కోసమో, డబ్బుల కోసమో, అవార్డుల కోసమో తన తండ్రి పని చేయలేదన్నారు. శరీరంలో బుల్లెట్లు ఉంచుకుని పోరాడారన్నారు.
మంగళవారం వెన్నెల గద్దర్ మీడియాతో మాట్లాడారు. సోయి ఉండే మాట్లాడుతున్నారా అని ప్రశ్నించారు. ప్రజలు బండిని క్షమించరని అన్నారు. ఇంకోసారి నోరు పారేసుకుంటే బాగుండదంటూ హెచ్చరించారు. భారత దేశ చరిత్రలో తన ఆట, పాట ద్వారా కోట్లాది ప్రజలను చైతన్యవంతం చేసిన గద్దర్ గురించి మాట్లాడే అర్హత బండి సంజయ్ కు లేదన్నారు.