అంగరంగ వైభవోపేతంగా స్వామి వారి బ్రహ్మోత్సవాలు
తిరుపతి – ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా రెండో రోజు సోమవారం వేణు గానాలంకారంలో స్వామి వారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు అభయమిచ్చారు.
ఉదయం 7.30 గంటల నుండి స్వామి వారి ఊరేగింపు వైభవంగా జరిగింది. భక్తజన బృందాలు చెక్క భజనలు, కోలాటాలతో స్వామి వారిని కీర్తిస్తుండగా, మంగళ వాయిద్యాల నడుమ స్వామి వారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామి వారిని దర్శించుకున్నారు.
ఉదయం 11 గంటలకు ఆలయంలో స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనంతో స్వామి, అమ్మ వార్లకు అభిషేకం చేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈఓ నటేష్ బాబు, సూపరింటెండెంట్ హనుమంతయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ నవీన్, ఆలయ అర్చకులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.