బాబు నిర్వాకం పెన్షనర్ల ఆగ్రహం
ఎంపీ విజయ సాయి రెడ్డి కామెంట్
నెల్లూరు జిల్లా – వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు నిర్వాకం కారణంగా ఇవాళ లక్షలాది మంది పెన్షనర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారంతా ఇప్పుడు తమకు పెన్షన్లు అందకుండా చేశారంటూ చంద్రబాబు నాయుడుపై మండి పడుతున్నారని పేర్కొన్నారు.
ఒకరిపై బురద చల్లేటప్పుడు , రాళ్లు వేసేటప్పుడు, విమర్శలు చేసేటప్పుడు ముందు వెనుకా ఆలోచించాలని తెలియదా అని ప్రశ్నించారు. పొద్దస్తమానం 40 ఏళ్ల రాజకీయ జీవితం అంటూ తెగ గొప్పలు పోయే బాబుకు ఇలాంటి చిన్న చిన్న విషయాలు తెలియక పోవడం విడ్డూరంగా ఉందన్నారు ఎంపీ విజయ సాయి రెడ్డి.
గురువారం ఆయన ట్విట్టర్ వేదికగా నిప్పులు చెరిగారు. చంద్రబాబు నాయుడు జీవితమంతా అబద్దాలమయమేనని పేర్కొన్నారు. ఆయనపై 33కి పైగా కేసులు ఉన్నాయని, అన్నింటికీ బెయిల్ తెచ్చుకుని గడుపుతున్నాడని ఆరోపించారు. ఒకవేళ కోర్టులు గనుక సీరియస్ గా విచారణ ప్రారంభిస్తే మనోడు 30 ఏళ్లకు పైగా జైలు జీవితం గడపక తప్పదన్నారు విజయ సాయి రెడ్డి.