కూటమి నేతలు అద్భుత నటులు
వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి
అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీలతో కూడిన ఎన్డీయే కూటమిపై నిప్పులు చెరిగారు వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి. ఆయన ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. తమ సినిమాలను ప్రమోట్ చేసుకునేందుకు ఏపీకి వచ్చిన నటీనటులు విడుదలయ్యాక తిరిగి వెళ్లి పోతున్నట్లుగా ఉంది ప్రస్తుత కూటమి నేతలను చూస్తుంటే అని ఎద్దేవా చేశారు.
చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ , పురందేశ్వరి వల్ల ఏపీకి ఒరిగేది ఏమీ లేదన్నారు. వీరిదంతా సొల్లు కబుర్లు తప్ప ఆచరణలో పనికి వచ్చేది ఏదీ లేదన్నారు. ఇక చంద్రబాబు నాయుడు గురించి ఎంత చెప్పినా తక్కువేనని అన్నారు. ఆయన అబద్దాలకు, మోసాలకు కేరాఫ్ అని ఆరోపించారు.
ఇక జనసేనాని పేరుతో తనంతకు తానుగా ప్రచారం చేసుకుంటూ వచ్చిన పవన్ కళ్యాణ్ తను ఏం మాట్లాడతాడో తనకే తెలియనట్టు నటిస్తూ ఉంటాడని , ఆయన సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా అద్భుతంగా నటిస్తున్నాడని ధ్వజమెత్తారు.
మరో ముఖ్యమైన నాయకురాలి గురించి ప్రస్తావించక తప్పడం లేదన్నారు. బీజేపీకి ఆమె చీఫ్ గా ఉన్నప్పటికీ పురందేశ్వరి కేవలం తన మరిది చంద్రబాబు నాయుడు కోసం మాత్రమే పని చేస్తోందని ఆరోపించారు విజయ సాయి రెడ్డి.