వెంకన్న సాక్షిగా ఆమెతో లింకు లేదు
ఎంపీ విజయ సాయి రెడ్డి కామెంట్స్
అమరావతి – వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై జరుగుతున్నదంతా దుష్ప్రచారం తప్ప మరోటి కాదన్నారు. రాజకీయంగా టీడీపీ నేతలు ఎదుర్కోలేకనే తనపై లేనిపోని విమర్శలు, నీతి మాలిన రాతలు రాయిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం విజయ సాయి రెడ్డి ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు.
గత కొన్ని రోజులుగా అదే పనిగా తనను టార్గెట్ చేస్తూ కొన్ని టీవీ ఛానళ్లు అవాస్తవాలు ప్రసారం చేస్తున్నాయని, తనపట్ల కావాలని బురద చల్లే ప్రయత్నం చేయడం మంచి పద్దతి కాదన్నారు విజయ సాయి రెడ్డి. ఛానళ్ల ముసుగులో చెలామణి అవుతున్న కొన్ని శక్తులకు తాను సంజాయిషీ ఇచ్చు కోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
ఓ ప్రజా ప్రతినిధిగా ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు ఎంపీ. శాంతి కళింగిరిని 2020 సంవత్సరం ఏసీ ఎండోమెంట్స్ ఆఫీసర్ గా వైజాగ్ సీతమ్మధార ఆఫీస్ లో మొట్ట మొదటగా కలిశానని తెలిపారు.
ఆనాటి నుంచి నేటి దాకా తాను ఆమెను కూతురుగానే భావించానని స్పష్టం చేశారు విజయ సాయి రెడ్డి. ఒక తండ్రిలా ఏ సహాయం కావాలన్నా చేశానని ఇందులో తప్పేముందని ప్రశ్నించారు. ఏ మహిళతోనూ తనకు వివాహేతర సంబంధం లేదన్నారు. తాను నమ్మిన దేవ దేవుడు వెంకన్న సాక్షిగా తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేందుకు సిద్దంగా ఉన్నానని విజయ సాయి రెడ్డి ప్రకటించారు.