జనం చూపు జగన్ వైపు
ఎంపీ విజయ సాయి రెడ్డి
నెల్లూరు జిల్లా – వై నాట్ 175 అన్న నినాదం తప్పక సాధ్యమవుతుందని స్పష్టం చేశారు ఎంపీ విజయ సాయి రెడ్డి. జగనన్నతో నడిచేందుకు నాయకులు ఉత్సాహం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ రెడ్డితో కలిసి విజయ సాయి రెడ్డి పాల్గొన్నారు. టీడీపీ కూటమికి ఆశించిన మేర ఫలితాలు రావన్నారు. వాళ్లంతా కలలు కంటున్నారని, అవి నిజం కావని కూడా వారికి తెలుసన్నారు. మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించడంలో, మాయ మాటలు చెప్పడంలో చంద్రబాబు నాయుడు మించిన నాయకుడు లేడన్నారు.
ఇప్పటికే ఏపీని అప్పుల కుప్పగా మార్చేసింది చాలక తానేదో అభివృద్ది చేశానంటూ గొప్పలు పోతున్నాడని , అయినా ఆయనను జనం నమ్మే స్థితిలో లేరన్నారు ఎంపీ. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నచ్చి చాలా మంది తమ పార్టీలో చేరుతున్నారని అన్నారు.
మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణు వర్దన్ రెడ్డి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరడం ఇందుకు నిదర్శనమని చెప్పారు విజయ సాయి రెడ్డి. ఆయన చేరికతో పార్టీకి మరింత బలం చేకూరినట్లయిందన్నారు. కావలి నియోజకవర్గంలో మంచి ఆదరణ కలిగి ఉన్న నాయకుడు అని కాటం రెడ్డిని ప్రశంసించారు.