తెలుగుదేశం గల్లంతు ఖాయం
ఎంపీ విజయ సాయి రెడ్డి కామెంట్
నెల్లూరు జిల్లా – రాష్ట్రంలో ఈ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ అడ్రస్ గల్లంతు అవడం ఖాయమని స్పష్టం చేశారు నెల్లూరు జిల్లా వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయ సాయి రెడ్డి. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయనతో పాటు రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య కూడా హాజరయ్యారు.
ఆ పార్టీని నమ్ముకున్న వారికి భవిష్యత్తు లేదన్నారు. ఆ తర్వాత వారిని పలకరించే నాథుడు కూడా ఒక్కరూ ఉండరన్నారు. నెల్లూరు బరిలో ఉన్న పొంగూరు నారాయణ చూద్దామని భూతద్దం పెట్టి వెతికినా కనిపించడంటూ ఎద్దేవా చేశారు విజయ సాయి రెడ్డి. ఆయనకు తన వ్యాపారాలు ముఖ్యం. విద్య పేరుతో లక్షలాది మందిని మోసం చేసిన ఘనుడంటూ ఎద్దేవా చేశారు.
నారాయణకు అంత సీన్ లేదన్నారు. కరోనా కష్ట కాలంలో జనం నుంచి డబ్బులు దోచుకున్న నీచుడంటూ సంచలన ఆరోపణలు చేశారు విజయ సాయి రెడ్డి. పేదలకు గత ఐదేళ్ళలో తమ ప్రభుత్వంలో జరిగినంత సంక్షేమం ఎన్నడూ జరగ లేదన్నారు.
ముఖ్యంగా ఆటో డ్రైవర్ల కుటుంబాలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందించామన్నారు. ఆటో డ్రైవర్లు అందరూ మళ్ళీ ఈ ప్రభుత్వమే రావాలని కోరుకుంటున్నారని చెప్పారు.