షర్మిల కాంగ్రెస్ లో చేరడం తప్పు
ఎంపీ విజయ సాయి రెడ్డి కామెంట్
అమరావతి – వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీకి రావడం సరైన నిర్ణయం కాదన్నారు. అంతే కాదు కాంగ్రెస్ పార్టీలో చేరి పెద్ద తప్పు చేసిందంటూ కామెంట్ చేయడం కలకలం రేపింది.
ప్రస్తుతం ఎన్నికల బరిలో వైఎస్ షర్మిల కడప నుంచి పోటీ చేస్తోంది. అక్కడ హత్యా నేరారోపణలు ఎదుర్కొంటున్నారు ఎంపీ అవినాష్ రెడ్డి. ఆయనను పదే పదే టార్గెట్ చేస్తూ వస్తోంది వైఎస్ షర్మిలా రెడ్డి. నిన్నటికి నిన్న సజ్జల రామకృష్ణా రెడ్డి వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టింది ఏపీ పీసీసీ చీఫ్.
ఇవాళ అదే బాటలో విజయ సాయి రెడ్డి వ్యక్తిగత విమర్శలకు దిగడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆమెది రాజకీయ తప్పిదమని అన్నారు. అయితే ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో రాజకీయంగా విభేదించిన మాట వాస్తవమేనని ఒప్పుకున్నారు విజయ సాయి రెడ్డి.
ఇదిలా ఉండగా 2014లో వైసీపీకి ఎన్డీయేలో చేరమని ఆఫర్ వచ్చిందని చెప్పారు. కానీ తాము నిర్ణయం తీసుకోలేక పోయామని తెలిపారు ఎంపీ. తాము కాదన్న తర్వాతనే తెలుగుదేశం పార్టీతో భారతీయ జనతా పార్టీ జత కట్టిందని స్పష్టం చేశారు.