DEVOTIONAL

దాత‌ల‌కు వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌నం

Share it with your family & friends

ఆనంద నిల‌యం అనంత స్వ‌ర్ణ‌మ‌యం

తిరుమ‌ల – టీటీడీ పాల‌క‌వ‌ర్గం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఆనంద నిలయం అనంత స్వర్ణమయం పథకానికి విరాళం ఇచ్చిన దాతలకు తీపి క‌బురు చెప్పింది. ఇక నుంచి వీరికి వీఐపీ బ్రేక్ (జనరల్) దర్శనాలను ఇవ్వాలని తీర్మానం చేసింది. ఈ విష‌యాన్ని ఈవో జె. శ్యామ‌ల రావు వెల్ల‌డించారు.

2008లో టీటీడీ సంకల్పించిన ఈ పథకాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల నిలిపివేసిన సంగతి విదితమే. అప్పట్లో ఈ పథకానికి విరాళం ఇచ్చిన దాతలకు అర్చనానంతర దర్శనం కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు.

అయితే ఇప్పుడు అర్చనానంతర దర్శన సేవ లేక పోవడంతో ప్రస్తుత ధర్మకర్తల మండలి ఈ పథకం దాతలకు ప్రత్యామ్నాయంగా వీఐపీ బ్రేక్ (జనరల్) దర్శనం కల్పించాలని నిర్ణయం తీసుకుంది.

”ఆనంద నిలయం అనంత స్వర్ణమయం” దాతలకు సవరించిన సౌకర్యాల వివరాలు ఇలా ఉన్నాయి.

అర్చనానంతర దర్శనానికి బదులుగా గరిష్టంగా 5 మంది కుటుంబ సభ్యులకు సంవత్సరానికి 3 రోజులు వీఐపీ బ్రేక్ (జనరల్)దర్శనాలకు అనుమతిస్తారు. ⁠రూ.2,500/- టారిఫ్‌లో సంవత్సరానికి 3 రోజులు వసతి కల్పిస్తారు. సంవత్సరానికి ఒకసారి 20 చిన్న లడ్డూలు ప్రసాదంగా అందిస్తారు.

దాతల దర్శన సమయంలో సంవత్సరానికి ఒకసారి బహుమానంగా ఒక దుపట్టా, ఒక బ్లౌజ్ బహుమానంగా అందిస్తారు. ⁠దాతల మొదటిసారి దర్శన సమయంలో 5 గ్రాముల బంగారు డాలర్, 50-గ్రాముల వెండి నాణెం బహుమానంగా ఇవ్వడం జరుగుతుంది.

⁠సంవత్సరానికి ఒకసారి పది మహాప్రసాదం ప్యాకెట్లు అందిస్తారు. ⁠విరాళం పాస్‌బుక్ జారీ చేసిన తేదీ నుండి 25 సంవత్సరాల పాటు చెల్లుబాటులో ఉంటుంది.