స్పష్టం చేసిన టీటీడీ ఈవో జె. శ్యామల రావు
తిరుమల – టీటీడీ సంచలన ప్రకటన చేసింది. తెలంగాణ ప్రజా ప్రతినిధులకు సంబంధించి తీపి కబురు చెప్పింది. ఈ మేరకు మార్చి 24న సోమవారం నుంచి సిఫార్సు లేఖలు స్వీకరించనున్నట్లు తెలిపారు ఈవో జె. శ్యామల రావు. టీటీడీ ఇంతకు ముందు ప్రకటించినట్లుగా, మార్చి 25, 30 తేదీలలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, శ్రీ విశ్వవాసు నామ సంవత్సర తెలుగు ఉగాది ఆస్థానం దృష్ట్యా సంబంధిత తేదీలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు స్పష్టం చేశారు. ఈ విషయాన్ని గమనించి తమతో సహకరించాలని విన్నవించారు ఈవో.
ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రతినిధుల నుండి సిఫార్సు లేఖలు సోమవారం నుండి అమలులోకి వస్తాయని తెలిపారు.
అందుకే సిఫార్సు లేఖలు మార్చి 23 ఆదివారం నుండి స్వీకరించడం జరుగుతుందన్నారు శ్యామల రావు. ఈ కారణంగా భక్తుల స్పష్టత కోసం మార్చి 25న వీఐపీ బ్రేక్ దర్శనం కోసం మార్చి 24న , మార్చి 30న దర్శనం కోసం మార్చి 29న ఎటువంటి సిఫార్సు లేఖలు స్వీకరించ బోమంటూ పేర్కొన్నారు ఈవో.
అదేవిధంగా సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనం కోసం ఆదివారం ఆంధ్ర ప్రజా ప్రతినిధుల నుండి అందుకున్న సిఫార్సు లేఖలను ఇకపై ఆదివారం వీఐపీ బ్రేక్ దర్శనం కోసం శనివారం స్వీకరిస్తామన్నారు. భక్తులు ఈ మార్పులను గమనించి టీటీడీకి సహకరించాలని కోరారు.