సుదీర్ఘ విరామం తర్వాత ప్లే
ముంబై – భారత క్రికెట్ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సుదీర్ఘ కాలం తర్వాత దేశీవాళి టోర్నీలో ఆడనున్నాడు. బీసీసీఐ దెబ్బకు స్టార్ ఆటగాళ్లు తమ నిర్ణయం మార్చుకున్నారు. కోహ్లీ ఢిల్లీ రంజీ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఈనెల 30న రైల్వేస్ తో ప్రారంభం అయ్యే మ్యాచ్ లో తను పాల్గొంటాడు.
ఆస్ట్రేలియా టూర్ సందర్బంగా సీనియర్ క్రికెటర్లు ఘోరంగా విఫలమయ్యారు. వీరిలో ప్రధానంగా విరాట్ కోహ్లీతో పాటు భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ సైతం ఫామ్ లేమితో బాధ పడుతున్నారు. దీంతో కీలక నిర్ణయం తీసుకుంది బీసీసీఐ.
ఎంతటి సీనియర్ ప్లేయర్ అయినా సరే దేశీవాళి టోర్నీలలో పాల్గొంటేనే జాతీయ జట్టుకు ఎంపిక చేస్తామని ప్రకటించింది. గత్యంతరం లేక ఆటగాళ్లంతా ఇప్పుడు రంజీ టోర్నీలో పాల్గొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, సంజూ శాంసన్ , రిషబ్ పంత్ , శుభ్ మన్ గిల్, యశస్వి జైశ్వాల్ , తదితర ఆటగాళ్లంతా ఇప్పుడు దేశీవాళి బాట పట్టారు. మరో వైపు కేరళ క్రికెట్ అసోసియేషన్ కు సంజూ శాంసన్ కు మధ్య అగాధం ఏర్పడింది. తను టోర్నీకి దూరంగా ఉండడంతో ఐసీసీ ఛాంపియన్ షిప్ జట్టుకు దూరమయ్యాడు.