భట్టిపై భగ్గుమన్న విశారదన్
యాదాద్రిలో జరిగిన అవమానం
హైదరాబాద్ – ధర్మ సమాజ్ పార్టీ చీఫ్ డాక్టర్ విశారదన్ మహారాజ్ నిప్పులు చెరిగారు. యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి సాక్షిగా జరిగిన అవమానంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు స్పందించక పోవడం దారుణమని పేర్కొన్నారు.
కొన్ని తరాల నుంచి ఇలా సాగిల పడటం వల్లనే, నిలదీయక పోవడం వల్లనే అవమానాలు కొనసాగుతూనే వున్నాయని పేర్కొన్నారు. అత్యధిక జనాభా కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ , మైనార్టీలు ఇవాళ ప్రతి చోటా అణిచివేతకు గురవుతున్నారని ఆవేదన చెందారు డాక్టర్ విశారదన్ మహారాజ్.
శ్రీరాముడి పాదాల వద్ద మన ఆంజనేయుడైన భట్టి విక్రమార్క కూర్చోవడంలో తప్పు ఏముందంటూ ప్రశ్నించారు. ఇది తర తరాలుగా మనకు నేర్పిన ఆచారమే కదా అంటూ ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా అక్కడే నిలదీయాల్సింది పోయి మౌనంగా కూర్చోవడం దారుణమని పేర్కొన్నారు డీఎస్పీ చీఫ్. అయినా బుద్ది, సిగ్గు, శరం , ఆత్మ గౌరవం ఉండాల్సింది భట్టికే కదా అని నిలదీశారు.
సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇతర మంత్రులు భట్టి విక్రమార్కకు, యావత్ దళిత జాతికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు విశారదన్ మహారాజ్.