NEWSTELANGANA

తెలంగాణ‌లో వివింట్ కంపెనీ పెట్టుబ‌డి

Share it with your family & friends


రాష్ట్ర స‌ర్కార్ తో అవ‌గాహ‌న ఒప్పందం

అమెరికా – తెలంగాణ‌లో మ‌రో కంపెనీ పెట్టుబ‌డి పెట్టేందుకు ముందుకు వ‌చ్చింది. అమెరికా ప‌ర్య‌ట‌న‌లో బిజీగా ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందులో భాగంగా ఆయ‌న ప‌లు కంపెనీల‌తో భేటీ అయ్యారు. అవ‌గాహ‌న ఒప్పంద ప‌త్రంపై సంత‌కాలు చేశారు.

ఇందులో భాగంగా హైదరాబాద్‌ జీనోమ్ వ్యాలీలో అత్యాధునిక ఇంజెక్టబుల్స్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి వివింట్ ఫార్మా కంపెనీ ముందుకొచ్చింది. రూ.400 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయబోయే ఈ కంపెనీ ద్వారా దాదాపు వెయ్యి మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

సీఎం రేవంత్ రెడ్డితో వివింట్ కంపెనీ ప్రతినిధుల మధ్య జరిగిన చర్చల అనంతరం పెట్టుబడులకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం జీనోమ్ వ్యాలీలో వివింట్ కంపెనీ ఆర్ అండ్ డీ కేంద్రం ఉంది. దాని విస్తరణలో భాగంగా హైదరాబాద్‌లో తన మొదటి తయారీ కర్మాగారాన్ని స్థాపించనుంది.

జీనోమ్ వ్యాలీలో పెట్టుబడులకు వివింట్ ఫార్మా ముందుకు రావటంపై ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. లైఫ్ సైన్సెస్ రంగంలో కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని చెప్పారు.

తెలంగాణలో అన్ని పరిశ్రమలకు అనుకూల వాతావరణం ఉందని, జీనోమ్ వ్యాలీ ఔషద కంపెనీలను తప్పకుండా ఆకర్షిస్తుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.