శివజయంతి ఉత్సవాల్లో పోలీస్ కమిషనర్ బాగ్చీ
విశాఖపట్నం : ధర్మ పరిరక్షణకు ప్రతి రూపం ఆ పరమ శివుడేనని, రుద్రభూమిలో ప్రతక్ష్యమైనప్పటికీ నిస్వార్ధంగా లోకానికి వెలుగులు పంచేది కూడా ఆయనేనని విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ అన్నారు. ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వ విద్యాలయం ఆధ్వర్యంలో శివ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నిస్వార్ధ సేవలకు ప్రతిరూపం శివుడేనన్నారు. ఆయన నిరంతరం విభూది ధరించి, సామాన్యుడిగానే భక్తులను అనుగ్రహించడం జరుగుతుందన్నారు.
పరమ శివుడిని సేవా భావంతో స్మరించుకుంటే సంపూర్ణంగా ప్రతి ఒక్కరికి విజయాలు లభిస్తాయని అన్నారు. విభజన సమయంలో తనను తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో ఎక్కడ విధులు నిర్వహిస్తారని ఆప్షన్ అడిగారని, అయితే తాను ఏపీనే ఎంచుకోవడం జరిగిందన్నారు. అందుకు ప్రత్యేక కారణం కూడా ఉందన్నారు.
తాను పరమశివుడు భక్తుడనని, ఏపీలో ఎక్కడ చూసినా అత్యంత ప్రాచుర్యం పొందిన శివాలయాలు ఉన్నాయని అందువల్లే ఏపీలో విధులు నిర్వహించడానికి ఇష్టపడటం జరిగిందన్నారు. తన సతీమణి కూడా శివ భక్తురాలేనని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఆనందమయ జీవనం గడపాలని, అలాగే ఇతరుల పట్ల జాలి, కరుణ, దయ, ప్రేమ అన్ని కలిగి ఉండాలని పిలుపునిచ్చారు.
ప్రతి రోజు ఒక్కరికైనా సహయం చేసే అలవాటు చేసుకోవాలన్నారు. అప్పికొండ సోమేశ్వర ఆలయంతో పాటు అనేక శివాలయాలు ఎంతో ప్రాచుర్యం పొందాయన్నారు. ఈ సందర్భంగా అందరికీ శివరాత్రి శుబాకాంక్షలు తెలియజేశారు.
కేజీహెచ్ సూపరిండింటెంట్ డాక్టర్ పి.శివానంద మాట్లాడుతూ తాను చిన్ననాటి నుంచి కష్టపడే తత్వంతో ముందుకు సాగానన్నారు. అలాగే భీమిలి ప్రాంతంలో చదువుకున్న సమయంలోనే ఆధ్మాత్మిక భక్తిభావం అలవర్చుకున్నట్లు చెప్పారు. నగర పోలీస్ కమిషనర్ మాదిరిగానే తాను కూడా నిరంతరం సహయం అందించడానికి సిద్దంగా ఉంటానన్నారు.
కార్యక్రమ నిర్వాహకురాలు బి.కె. రామేశ్వరి మాట్లాడుతూ మహా శివరాత్రి పర్వదినం లోకానికి అత్యంత పుణ్యప్రదంగా నిలుస్తుందన్నారు. శివుడిని పూజించే భక్తులందరికీ పాపాల నుంచి విముక్తి కల్పించడమే కాకుండా మంచి జీవితాన్ని ప్రసాదించే మహిమ గల స్వామిగా అభివర్ణించారు.
సింహచలం దేవస్ధానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు, జాతీయ జర్నలిస్టల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ పరమశివుడిని ఆరాధించడం వల్ల సర్వజీవులకు సంతోషం కలుగుతుందన్నారు. అందుకే శివరాధనకు అత్యంత ప్రాముఖ్యత ఉందన్నారు.
అంతకు ముందు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆలరించాయి. కార్యక్రమంలో పాల్గొన్న బ్రహ్మకుమారీస్ జర్నలిస్టులకు ప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు, జర్నలిస్టులు పాల్గొన్నారు.