30న విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
16న నామినేషన్ల పరిశీలన
విశాఖపట్టణం – ఎంతో ఉత్కంఠ రేపిన విశాఖపట్టణం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఊసురు మనిపించింది. కూటమి ప్రగల్భాలు పలికినా చివరకు పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. మంగళవారం నాటితో నామినేషన్ల గడువు ముగిసింది. ఈనెల 16న నామినేషన్లను పరిశీలించనున్నారు. దీంతో వైసీపీ తరపున బరిలో నిలిచిన బొత్స సత్యనారాయణ ఎన్నికకు లైన్ క్లియర్ అయినట్టే.
తెలుగుదేశం పార్టీ కూటమి తొలుత అభ్యర్థిగా బైరాను ప్రకటించింది. ఆ తర్వాత ఎందుకనో తాము పోటీ చేయ బోవడం లేదంటూ స్పష్టం చేసింది. ఇది కూటమికి ఒక రకంగా బిగ్ షాక్ అని చెప్పక తప్పదు. దీనికి కారణం ఏమిటంటే జిల్లాలో మొత్తం 838 సీట్లు ఉండగా ఇందులో వైసీపీ జగన్ రెడ్డి పార్టీకి 530కి పైగా సీట్లు ఉన్నాయి.
ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎన్ని కోట్లు వెద జల్లినా చివరకు ఒక్క ఎమ్మెల్సీ పదవే కదూ అనుకుని మెల్లగా జారుకుంది కూటమి పోటీ నుంచి. మరో వైపు నామినేషన్ దాఖలు చేసిన బొత్స సత్యనారాయణ తనకు రూ. 93 లక్షల అప్పు ఉందంటూ అఫిడవిట్ లో పేర్కొనడం విశేషం. ఆయనకు పోటీగా స్వతంత్ర అభ్యర్థి షఫీ ఉల్లా ఉన్నారు. మొత్తంగా బొత్సనా మజాకా అంటున్నారు వైసీపీ శ్రేణులు.