విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకుంటాం
స్పష్టం చేసిన లోక్ సభ సభ్యుడు భరత్
విశాఖపట్నం – వైజాగ్ పార్లమెంట్ సభ్యుడు భరత్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తమ ప్రభుత్వం పూర్తిగా ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తుందని, వారికి ఇబ్బంది పెట్టే ఏ పని చేయదని పేర్కొన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఎవరి పరం కాకుండా చూస్తామని అన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు ఎంపీ.
వేలాది మంది కార్మికులు ప్రత్యక్షంగా, పరోక్షంగా విశాఖ స్టీల్ ప్లాంట్ పై ఆధారపడి పని చేస్తున్నారని తెలిపారు. వారిని ఆదుకునే బాధ్యత తమ కూటమి సర్కార్ పై ఉందన్నారు. రాజకీయ లబ్ది కోసం కొందరు పనిగట్టుకుని స్టీల్ ప్లాంట్ ను అమ్మేస్తున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారని ఇది మంచి పద్దతి కాదని హితవు పలికారు ఎంపీ భరత్.
వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వీలైతే ప్రభుత్వం ముందుకు విశాఖ స్టీల్ ప్లాంట్ ను పరిరక్షించుకునేందుకు సలహాలు, సూచనలు ఇవ్వాలని సూచించారు. కానీ ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు ఎంపీ.
ఆరు నూరైనా తమ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం కానీయదని కుండ బద్దలు కొట్టారు. కేంద్ర మంత్రితో సీఎం మాట్లాడతారని, దానిని మరింత బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటారని చెప్పారు.