అంగరంగ వైభవంగా టీటీడీ ఏర్పాట్లు
తిరుపతి – ఒంటిమిట్ట లోని శ్రీ కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి. ధ్వజారోహణంతో స్వామి వారి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఈ ఉత్సవాలు తొమ్మిది రోజుల పాటు ఈ ఉత్సవాలు కొనసాగాయి. రాత్రి 7 గంటలకు ధ్వజారోహణ ఘట్టం నిర్వహించారు. అనంతరం గరుడ పటాన్ని అవతనం చేశారు. బ్రహ్మోత్సవాలలో పాలు పంచుకునే వారు సమస్త పాపవిముక్తులై, ధనధాన్య సమృద్ధితో తులతూగుతారని ఐతిహ్యం. విషమృత్యు నాశనం, రాజ్య పదవుల వంటి సకల శ్రేయస్సులు పొందుతారని భక్తుల విశ్వాసం .ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో నటేష్ బాబు, సూపరింటెండెంట్ హనుమంతయ్య, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ నవీన్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
ఇదే సమయంలో ఒంటిమిట్ట ఆలయంలో శ్రీ సీతా కోదండ రామ స్వామి కళ్యాణోత్సవం నభూతో నభవిష్యత్ అన్న రీతిలో చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సీఎం నారా చంద్రబాబు నాయుడు, నారా భువనేశ్వరి దంపతులు ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుతో పాటు ఇంఛార్జ్ మంత్రి సవిత, ఈవో శ్యామల రావు, ఏఈవో చౌదరి, జేఈవో వి. వీరబ్రహ్మం , జిల్లా కలెక్టర్, ఎస్పీ పాల్గొన్నారు. 75 వేల మందికి పైగా భక్తులు హాజరయ్యారు. కళ్యాణోత్సవంలో పాల్గొని స్వామి , అమ్మ వారి కృపకు పాత్రులయ్యారు. ఈ సందర్బంగా టీటీడీ చైర్మన్, ఈవోలను ప్రత్యేకంగా ప్రశంసించారు సీఎం చంద్రబాబు.