టీఎస్ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు
హైదరాబాద్ – రేవతి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకునే బాధ్యత తాను తీసుకుంటానని ప్రకటించారు తెలంగాణ రాష్ట్ర ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు. తొక్కిసలాట ఘటన నిజంగా దురదృష్టకరమని అన్నారు.
ఆ దేవుడి దయతో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. తండ్రికి పర్మినెంట్ జాబ్ ఇస్తామన్నారు. ఇండస్ట్రీ ఎక్కడికీ వెళ్లదన్నారు.
మంగళవారం ఆయన కిమ్స్ ఆస్పత్రిలో శ్రీతేజ్ ను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కాగా ఇండస్ట్రీని ప్రభుత్వం దూరం పెడుతోంది అంటూ వస్తున్న ప్రచారం పూర్తిగా అబద్దమన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి సినిమా రంగంలో ప్రముఖులతో సత్ సంబంధాలు ఉన్నాయని చెప్పారు.
ప్రభుత్వానికి సినీ పరిశ్రమకు మధ్య దూరం ఉండ కూడదనే త్వరగా చైర్మన్ గా తనను నియమించినట్లు తెలిపారు. మొత్తంగా జరిగిన ఘటన కావాలని జరిగింది కాదన్నారు. ఏది ఏమైనా సమస్యను త్వరగా పరిష్కరించేందుకు గాను సినీ పెద్దలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తామని వెల్లడించారు దిల్ రాజు.