ఫేస్ బుక్ మెటాతో ప్రభుత్వం ఒప్పందం
అమరావతి – వాట్సాప్ ద్వారా 161 పౌర సేవలను అందించేందుకు ఏపీ సర్కార్ ఫేస్ బుక్ మెటా సంస్థతో ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా గురువారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పౌరులకు సంబంధించిన 161 సేవలను అందుబాటులోకి తీసుకు వచ్చింది. పాలనా పరంగా ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు ఇది దోహదం చేస్తుందన్నారు ఈ సందర్బంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు. రాబోయే రోజుల్లో ఈ గవర్నెన్స్ పాత్ర కీలకం కాబోతోందని స్పష్టం చేశారు.
ఈ సందర్బంగా ఈ గవర్నెన్స్ అమలు గురించి వివరాలు వెల్లడించారు ఏపీ ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్. ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ పాలనలో ప్రజలకు అవసరమయ్యే ధ్రువీకరణ పత్రాల జారీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వినూత్నంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు.
ప్రజలకు అవసరమైన ధ్రువీకరణ పత్రాల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ చెప్పులు అరిగేలా ప్రదక్షణలు చేయవలసిన అవసరం ఉండదన్నారు. విలువైన సమయం వృధా కాదన్నారు. పాలనలో ప్రజలకు అందుబాటులో ఉన్న సాంకేతికత ద్వారా వారి సమయం వృధా కాకుండా సేవలు అందించే నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కి ధన్యవాదాలు తెలిపారు.
గుడ్ గవర్నెన్స్ లో “ వాట్సాప్ గవర్నెన్స్ “ ఒక ముఖ్యమైన ఘట్టం, రియల్ టైం గవర్నెన్స్ కి ఒక చక్కటి ఉదాహరణ అని పేర్కొన్నారు లంకా దినకర్. పౌరుల ధ్రువీకరణ పత్రాల జారీ చేసేముందు వారికి సంబంధించిన సరైన సమాచారం సేకరించి ధ్రువీకరణ పత్రాలను సంబంధిత వ్యక్తులకు అందిచే ఈ ప్రక్రియ మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా ఉంటుందన్నారు.