ఏఈవోకు అందజేసిన ముంబై భక్తుడు
తిరుమల – కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా భక్తులు భావించే తిరుమలకు పెద్ద ఎత్తున కానుకలు, విరాళాలు ప్రతి రోజూ అందుతూనే ఉన్నాయి. తాజాగా ముంబైకి చెందిన భక్తుడు తుషార్ కుమార్ టీటీడీ అన్న ప్రసాదం ట్రస్ట్ కు ఏకంగా రూ. 11 కోట్లు భారీ విరాళాన్ని అందజేశారు. ఇందుకు సంబంధించిన చెక్కును అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరికి అందజేశారు. ఈ సందర్బంగా భక్తుల ఆకలిని తీరుస్తున్న అన్న ప్రసాదానికి భారీ విరాళాన్ని అందజేసిన భక్తుడిని ప్రత్యేకంగా అభినందించారు ఏఈవో.
ఇదిలా ఉండగా ప్రతి రోజూ 70 వేల మందికి పైగా శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను భక్తులు దర్శించుకుంటున్నారు. ఏ ఒక్కరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా టీటీడీ పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటోంది. గతంలో దివంగత సీఎం నందమూరి తారక రామారావు తొలిసారిగా తిరుమలలో అన్న ప్రసాదంను ప్రారంభించారు. ఆయన చేతి చలవ ఏమిటో కానీ పెద్ద ఎత్తున రోజు రోజుకు అన్న ప్రసాదం స్వీకరించే భక్తుల సంఖ్య పెరుగుతోంది.
దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చే భక్తులు తమకు తోచినంత మేర స్వామి , అమ్మ వార్లకు కానుకలు, విరాళాల రూపేణా పెద్ద ఎత్తున అందజేస్తూ వస్తున్నారు. ఈ తరుణంలో ముంబై భక్తుడు అందించిన విరాళం సంచలనంగా మారింది.