మహిళా దినోత్సవం సరే గుర్తింపేది
అన్ని రంగాలలో నిరాదరణ..వివక్ష
ప్రతి ఏటా మార్చి 8న మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం. కానీ సమాజంలో , జీవితంలో , దేశ అభివృద్దిలో..ప్రతి అడుగులో కీలకమైన పాత్ర పోషిస్తున్న మహిళలకు స్వేచ్ఛ ఏమైనా ఉందా. అంటే లేదనే చెప్పక తప్పదు. ప్రతి రంగంలో వారు లేనిదే ముందుకు నడవదు. కానీ వారంటూ ఎక్కడో మూలన పడి ఉండాల్సిందే. కొద్ది మంది మాత్రమే ప్రచారంలోకి వస్తున్నారు. మిగతా వాళ్లు నిరాదరణకు లోనవుతున్నారు. అద్బుతమైన ఫలితాలు సాధిస్తున్నారు. చరిత్ర సృష్టిస్తున్నా ప్రధాన స్రవంతిలో వాళ్ల ఉనికి లేకుండా పోతోంది. ఇది కాదు కావాల్సింది. ఇప్పటి వరకు దేశ రాజకీయాలలో కానీ, ప్రజా దేవాలయంలో కూడా చట్టాలను రూపొందించే క్రమంలో ఎంత మంది ఉన్నారని లెక్కిస్తే శూన్యమే. గవర్నర్లు, సీఇఓలు, చైర్మన్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు , రాష్ట్రపతి గా మహిళలు ఉన్నా ఎక్కడా ప్రాధాన్యత ఉండడం లేదు.
అనాది నుంచి నేటి ఆధునికం దాకా ఆమెను ఒక వస్తువుగా మాత్రమే చూశాం. జీవితంలో ఒక భాగంగా ఏనాడూ పరిగణించ లేక పోయాం. అందుకే వాళ్లు స్వేచ్ఛను కోరుకుంటున్నారు. తమ మానాన తాము బతుకుతామంటూ తెగేసి చెబుతున్నారు. దానికి వాళ్లపై అభాండాలు వేయడం మానలేదు. ఇప్పటికీ మహిళలపై హింస కొనసాగుతూనే ఉంది. పుట్టినప్పటి నుంచి పెరిగేంత దాకా అడుగడుగునా అవమానాలే ..మానసికంగా..శారీరకంగా చిత్ర హింసలే. వీటికి హద్దు లేదు..చెప్పాలంటే ఒక ఏడాది కూడా సరిపోదు. సమాజంలో మార్పు రానంత వరకు మహిళల్లో మార్పు రాదని అనుకున్నంత కాలం ఇలాగే ఉంటుంది ఈ వ్యవస్థ. కానీ మారాల్సింది సమాజం కాదు ..పురుషుల ఆలోచనా రీతిలో మహిళల పట్ల ఉన్న ఆధిపత్య ధోరణి పోవాలి.
ఇదే సమయంలో మహిళలు సైతం తాము ఎక్కడైనా బతకగలమన్న ధైర్యాన్ని కూడ దీసుకోవాలి. సమున్నత భారత దేశంలో లైంగిక వేధింపులు, మానిసిక చిత్రహింసలకు కొదవే లేకుండా పోయింది. నిత్యం శ్లోకాలు, వేదాలు, భరత భూమి అంటూ బీరాలు పలికే పాలకులు కలిగిన తరుణంలో ఒక మహిళను సామూహికంగా అత్యాచారానికి పాల్పడిన వారిని నిస్సిగ్గుగా విడుదల చేసిన చరిత్ర మనది. చిన్నారుల నుంచి పండు ముదుసలి వరకు ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని బతకాల్సిన పరిస్థితి దాపురించింది.
ప్రతి చోటా ప్రతి నోటా మహిళల పట్ల ఛీత్కార భావన పోనంత వరకు ఇలాంటి ఘటనలు ఎదురవుతూనే ఉంటాయి. వాళ్లు కూడా మనుషులేనన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో కలిగిన నాడే వారికి తగిన రీతిలో గుర్తింపు వస్తుంది. చట్ట సభల్లో కనీసం 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తే కనీసం కొంతలో కొంతైనా మార్పు వస్తుందని ఆశిద్దాం. అవును మహిళలకు ఒక రోజు ఏమిటి..ప్రతి రోజూ వాళ్లదే అయినప్పుడు..మనల్ని కన్నందుకు..ప్రాణం పోసినందుకు..ఆకలి తీరుస్తున్నందుకు మనందరం (పురుష లోకం ) రుణపడి ఉండాలి.
See less