నారా లోకేష్ తో వరల్డ్ బ్యాంక్ ప్రతినిధుల భేటీ
విద్యా రంగంలో సంస్కరణలపై విస్తృత చర్చలు
అమరావతి – ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ తో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు భేటీ అయ్యారు. ఈ సందర్బంగా రాష్ట్రంలో విద్యా రంగంలో తీసుకున్న నిర్ణయాలు, సంస్కరణల గురించి వారికి వివరించారు. ప్రధానంగా విద్యార్థులపై ప్రయోగాలు చేయకుండా ప్రయోజకులుగా తీర్చిదిద్దే సంస్కరణలు అమలు చేయాలని సూచించారు మంత్రి.
ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లను పెంచడం, ఉపాధ్యాయుల బదిలీలు పారదర్శకంగా చేసేందుకు ఒక యాప్‌ని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ విద్యా విధానాలను రాష్ట్రంతో పంచుకోవాలని వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులను కోరారు నారా లోకేష్.
ప్రత్యేకించి తమ ప్రభుత్వం ప్రపంచంతో పోటీ పడేలా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. ఇందులో భాగంగా నైపుణ్యాభివృద్ది పై ఎక్కువగా ఫోకస్ పెట్టామని స్పష్టం చేశారు ఏపీ మంత్రి. అన్ని రంగాలలో విద్యార్థులు రాటు దేలాలా శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అన్నారు నారా లోకేష్. ఇదిలా ఉండగా రాష్ట్ర సర్కార్ విద్యా రంగం కోసం చేస్తున్న కృషిని ప్రత్యేకంగా అభినందించారు ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు.