హాజరు కానున్న రాష్ట్ర గవర్నర్ విష్ణు దేవ్
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభం అయ్యాయి. ఈనెల 11వ తేదీ వరకు ఉత్సవాలు కొనసాగనున్నాయి. ఈ సందర్బంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఉత్సవాలకు రాష్ట్ర గవర్నర్ తో పాటు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు హాజరవుతారని ఈవో భాస్కర్ రావు వెల్లడించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు.
హైదరాబాద్‌లోని రాజ్ భవన్‌లో గవర్నర్‌ను కలిసి శ్రీ స్వామి వారి లడ్డూ ప్రసాదంతో పాటు ప్రత్యేక ఆహ్వాన పత్రికను అందజేశారు. మార్చి 1న విశ్వక్సేనుడి పూజ, స్వస్తి వాచనతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని ఆయన అన్నారు.
7న మహోత్సవం, 8న శ్రీ స్వామివారి తిరు కళ్యాణ మహోత్సవం, 9న రథోత్సవం, 10న చక్రతీర్థ స్నానం ఉత్సవాలు ఉంటాయని ఆయన చెప్పారు. 11న రాత్రి డోలోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయని వివరించారు.
3న శ్రీ స్వామి వారి అలంకార, వాహన సేవలు ప్రారంభమవుతాయని ఆయన చెప్పారు. ఇదిలా ఉండగా, బ్రహ్మోత్సవాల్లో భాగంగా సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8.30 గంటల వరకు భక్తులను, వాహనాలను కొండపైకి ఉచితంగా పంపాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు ఆయన తెలిపారు.