వీహెచ్పీ అధ్యక్షుడిగా యార్లగడ్డ
హిందీ భాష అభివృద్ధికి ఎనలేని కృషి
అమరావతి – ప్రముఖ సాహితీవేత్త , హిందీ భాషా ప్రేమికుడు ఏపీకి చెందిన యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ కు అరుదైన గౌరవం దక్కింది. తెలుగు, హిందీ భాషల వ్యాప్తికి విశేషమైన కృషి చేస్తున్న ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ను ‘విశ్వ హిందీ పరిషత్’ జాతీయ అధ్యక్షుడిగా నియమించారు.
ప్రపంచ వ్యాప్తంగా హిందీ వినియోగం, ప్రచారంలో అగ్ర భాగాన వున్న సంస్థ ‘విశ్వ హిందీ పరిషత్’. ఈ సంస్థ విశ్వ వ్యాప్తంగా వివిధ దేశాలలో హిందీ భాష ద్వారా భారతీయ సంస్కృతిని వ్యాప్తి చేయడానికి కృషి చేస్తున్నది.
భారతదేశంలో అన్ని ప్రాంతీయ భాషలతో సమన్వయం చేసి హిందీ శబ్ద శక్తిని పెంచడం, తద్వారా భాషా పరంగా జాతీయ సమైక్యతను సాధించడం ఈ సంస్థ ప్రధాన లక్ష్యం. ఈ లక్ష్యాలను నెరవేర్చడానికి హిందీయేతర ప్రాంతీయుడైనప్పటికీ ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ను రెండు సంవత్సరాలకు గాను ఈ పదవిలో నియమించారు.
ప్రపంచ వ్యాప్తంగా పర్యటించి వివిధ దేశాలలో ఈ సంస్థ లక్ష్యాలను విజయవంతంగా నిర్వహిస్తారన్న నమ్మకంతో ‘యార్లగడ్డ’ ను జాతీయ అధ్యక్షుడిగా నియమించడానికి సంస్థ కార్యవర్గం ఏకగ్రీవంగా తీర్మానించి ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
వైఎల్పీ నియామకం పట్ల తెలుగు, హిందీ భాష అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. హిందీ అభివృద్ధికి యార్లగడ్డ చేస్తున్న కృషికి తగిన గౌరవం లభించిందని ప్రస్తుతించారు.