సిలికానాంధ్ర సమావేశంలో యార్లగడ్డ
అమెరికా –
విభిన్న భాషలు నేర్చుకోవడం వ్యక్తిగతంగా ఎంతో ప్రయోజనకరమని, దానివల్ల భాషకు ప్రత్యేకమైన ప్రయోజనం ఉండబోదని విశ్వ హిందీ పరిషత్ జాతీయ అధ్యక్షుడు, పద్మభూషణ్ ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ పేర్కొన్నారు. అమెరికా బే ఏరియాలో సిలికానాంధ్ర నిర్వహించిన వేడుకల్లో యార్లగడ్డ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన త్రిభాషా సూత్రం జాతీయ ఐక్యతకు సహాయ పడుతుందని చెప్పారు. ఈ ప్రతిపాదనలో హిందీని తప్పనిసరి చేయలేదని, అయితే మాతృ భాషతో పాటు మరో భారతీయ భాషను అధ్యయనాన్ని ప్రోత్సహించడమే దీని ఉద్దేశమని ఆయన స్పష్టం చేసారు. ఏ భాషను నేర్చుకోవాలనేది పూర్తిగా తల్లిదండ్రులు, విద్యార్థులు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని అన్నారు.
భారతీయ సంస్కృతి, తెలుగు సంప్రదాయాలు, ఆచార వ్యవహారాల పరిరక్షణలో ప్రవాసాంధ్రులు చేస్తున్న కృషిని లక్ష్మీప్రసాద్ ప్రశంసించారు. విదేశాల్లో నివసిస్తున్నా, తమ మూలాలను మరవకుండా, యువతరానికి తెలుగు సంస్కృతిని అందించేందుకు సిలికానాంధ్ర చేస్తున్న సేవలను ఆయన అభినందించారు.
ఈ కార్యక్రమానికి సిలికానాంధ్ర వ్యవస్థాపకుడు కుచిభొట్ల ఆనంద్ అధ్యక్షత వహించారు. ప్రత్యేక అతిథిగా భారత కాన్సుల్ జనరల్ శ్రీకర్ రెడ్డి హాజరయ్యారు. వేడుకలలో గరికిపాటి వెంకట ప్రభాకర్ ప్రదర్శించిన స్వర రాగావధానం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమం అనంతరం అరిటాకు పై సంప్రదాయ తెలుగు విందు ఏర్పాటు చేసి, ఉగాది ఉత్సవాన్ని మరింత ఆనందోత్సాహ భరితంగా మార్చారు.