జట్టు నుంచి రిలీవ్ చేయాలని లేఖ
ముంబై – ప్రముఖ భారత క్రికెటర్ యశస్వి జైశ్వాల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తాను ఇక నుంచి ముంబై జట్టుకు ఆడబోనంటూ ప్రకటించాడు. తను తీసుకున్న నిర్ణయం క్రికెట్ వర్గాలలో కలకలం రేపింది. ప్రస్తుతం ఐపీఎల్ 2025 టోర్నీలో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. తను ఓపెనర్ గా ఆడుతున్నాడు. గత సీజన్ లో దుమ్ము రేపిన జైశ్వాల్ తాజా సీజన్ లో అత్యంత పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరిచాడు. తనతో పాటు స్కిప్పర్ సంజూ శాంసన్ కూడా ఆశించిన మేర ఆడడం లేదు. ఇది పక్కన పెడితే ఉన్నట్టుండి తనను ముంబై జట్టు నుంచి రిలీవ్ చేయాలని కోరుతూ బీసీసీఐకి యశస్వి జైశ్వాల్ లేఖ రాశాడు.
అత్యంత పేదరికం నుంచి వచ్చిన యశస్వి జైశ్వాల్ క్రికెట్ లో ముంబైలో ఓనమాలు నేర్చుకున్నాడు. జాతీయ జట్టుకు ఇక్కడి నుంచి ఎంపికయ్యాడు. దేశీవాళి క్రికెట్ కు సంబంధించి తనను రిలీవ్ చేయాలని కోరుతూ ముంబై క్రికెట్ అసోసియేషన్ కు లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. తనకు నో ఆబ్జక్షెన్ సర్టిఫికెట్ (ఎన్ఓసీ) ఇవ్వాలని కోరాడు జైశ్వాల్. ఇదిలా ఉండగా ఈ యంగ్ క్రికెటర్ వచ్చే సీజన్ నుంచి గోవా జట్టు తరపు నుంచి ఆడనున్నాడు. 2025-26 సీజన్ లో ప్రాతినిధ్యం వహించనున్నాడు. జాతీయ జట్టులో లేనప్పుడు తను గోవా టీం తరపున ఆడతాడని గోవా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి శంబా దేశాయ్ వెల్లడించారు. కాగా యశస్వి జైశ్వాల్ 2019 నుంచి ముంబైకి ఆడుతున్నాడు.