నా ఫోన్ ట్యాపింగ్ చేశారు
కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం
హైదరాబాద్ – పాలమూరు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. తన ఫోన్ గత ఐదు సంవత్సరాలుగా ట్యాపింగ్ జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తన ఫోన్ తో పాటు బంధువులు, స్నేహితులకు సంబంధించిన ఫోన్లను కూడా ట్యాప్ చేశారంటూ ఆరోపించారు. మంగళవారం యెన్నం శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
తన ఫోన్ ట్యాపింగ్ చేయమని గతంలో ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రులు ఆదేశించారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను కూడా బాధితుడినేనని, అందుకే ఫోన్ ట్యాపింగ్ జరిగిన విషయానికి సంబంధించి ఆధారాలతో సహా డీజేపీ రవి గుప్తాను కలిసి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు యెన్నం శ్రీనివాస్ రెడ్డి.
మేమంతా లిఖిత పూర్వకంగా డీజీపికి ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. భారత రాజ్యాంగం పౌరులకు ప్రాథమిక హక్కులు కల్పించిందన్నారు. ఫోన్ ట్యాపింగ్ అనేది పూర్తిగా చట్ట విరుద్దమన్నారు. ఈ రాష్ట్రంలో స్వేచ్చ లేకుండా పోయిందని, తమ సర్కార్ వచ్చాక అసలు వాస్తవాలు బయటకు వచ్చాయని తెలిపారు. నాలాంటి బాధితులు ఒక్క పాలమూరు జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారని అన్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు లక్షలాది మంది ఉన్నారని చెప్పారు.
ప్రతి జిల్లాలో ఫిర్యాదులకు సంబంధించి సెంటర్ ను ఏర్పాటు చేయాలని కోరారు యెన్నం శ్రీనివాస్ రెడ్డి.