నిప్పులు చెరిగిన మాజీ సీఎం జగన్ రెడ్డి
కక్ష సాధింపుతోనే నటుడు పోసాని కృష్ణ మురళిని అరెస్ట్ చేశారంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ సీఎం జగన్. అధికారం అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా కేసులు నమోదు చేయడం, ఇబ్బందులు పెట్టడం పరిపాటిగా మారిందన్నారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. కోర్టులో తేల్చుకుంటామని స్పష్టం చేశారు. పోసాని సతీమణి కుసుమలతను ఫోన్ లో మాట్లాడారు. అరెస్ట్ విషయంలో అండగా ఉంటామని, ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు. ఏపీ లో రాక్షస పాలన సాగుతోందని ఆరోపించారు.
పోసాని కృష్ణ మురళి అరెస్ట్ ను తాను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు జగన్ మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వ పాలన నిరంకుశంగా సాగుతోందని ధ్వజమెత్తారు. ఈ అరెస్ట్ విషయంలో పోసాని కృష్ణ మురళికి వైయస్ఆర్సీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
జరుగుతున్న వ్యవహారాలను ప్రజలు, దేవుడు చూస్తున్నారని, కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలన్నారు. పార్టీ తరుఫున న్యాయ పరంగా సహాయం అందిస్తామని, ఇప్పటికే పార్టీకి సంబంధించిన సీనియర్ న్యాయవాదులకు ఈ వ్యవహారాన్ని అప్పగించామని తెలిపారు. ఇదిలా ఉండగా రాష్ట్రం లో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందన్నారు వైసీసీ సీనియర్ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి.