జవాన్ల కుటుంబాలకు కోటి ఇవ్వాలి
డిమాండ్ చేసిన ఏపీ మాజీ సీఎం జగన్
అమరావతి – ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. లద్దాఖ్ ప్రమాదంలో మరణించిన జవాన్ల కుటుంబాలకు రూ.1 కోటి చొప్పున ఆర్థిక సహాయం చేయాలని కోరారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు విన్నవించారు.
సోమవారం ఆయన కీలక ప్రకటన చేశారు. లద్దాఖ్‌లో యుద్ధ ట్యాంకు కొట్టుకు పోయిన ప్రమాదంలో జవాన్లు ప్రాణాలు కోల్పోవడంపై మాజీ ముఖ్యమంత్రి తీవ్ర దిగ్భాంతి వ్యక్తంచేశారు. ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు జవాన్లు మరణించిన ఘటనపై విచారం వ్యక్తంచేశారు.
వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు.. దేశ రక్షణలో వీరి సేవలు చిరస్మరణీయమన్నారు. వారి త్యాగాలు మరువలేనివని పేర్కొన్నారు.. కృష్ణా జిల్లా పెడన మండలం చేవెండ్రకు చెందిన సాదరబోయిన నాగరాజు, ప్రకాశం జిల్లా రాచర్ల మండలం కాల్వపల్లె గ్రామానికి చెందిన జూనియర్ కమిషన్డ్ అధికారి (జేసీవో) ముత్తుముల రామకృష్ణా రెడ్డి, బాపట్ల జిల్లా రేపల్లె మండలం ఇస్లాంపూర్ కు చెందిన సుభాన్ ఖాన్‌ల కుటుంబాలకు తన సంతాపాన్ని తెలియజేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆయా కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తిచేశారు. మరణించిన జవాన్ల కుటుంబానికి రూ.1 కోటి చొప్పున ఆర్థిక సహాయం చేయాలని కోరారు. ఆయా నియోజకవర్గాలకు చెందిన వైయస్సార్‌సీపీ నాయకులు వీరి అంత్యక్రియల్లో పాల్గొనాలని, వారి కుటుంబాలకు బాసటగా నిలవాలని వైయస్.జగన్ ఆదేశించారు.