ఎవరు చంపారో ఆ దేవుడికి తెలుసు
చెల్లెమ్మల ఆరోపణలు అర్థ రహితం
అమరావతి – ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. తన చిన్నాన్న, మాజీ ఎంపీ దివంగత వైఎస్ వివేకానంద రెడ్డిని దారుణంగా హత్యకు గురి కావడంపై లేనిపోని ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన స్పందించారు. పదే పదే తనను, ఎంపీ అవినాష్ రెడ్డిని దోషులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపించారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు.
తమ చిన్నాన్నను ఎవరు చంపారో..ఎవరు చంపించారో..ఆయనకు ..ఆ దేవుడికి , ఈ జిల్లా ప్రజలందరికీ తెలుసన్నారు జగన్ మోహన్ రెడ్డి. అయితే కావాలని పనిగట్టుకుని ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారో..వారి వెనకాలో ఎవరు ఉన్నారో కూడా మీకు ఇప్పటికే అర్థమై ఉంటుందన్నారు.
విచిత్రం ఏమిటంటే ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే కిరాతకంగా హత్య చేసినట్లు ఒప్పుకుని బహిరంగంగానే తిరుగుతున్న హంతకుడికి మద్దతు ఇస్తున్నది ఎవరో కూడా రోజూ చూస్తూనే ఉన్నామని, తాను ఎందుకు చంపిస్తానంటూ ప్రశ్నించారు జగన్ మోహన్ రెడ్డి. ఇకనైనా అసత్యాలు మాట్లాడటం మానుకోవాలని సూచించారు సీఎం.