ఏపీలో 28న పూజల్లో పాల్గొనాలి – వైఎస్ జగన్
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై ఫైర్
అమరావతి – వైస్సార్సీపీ బాస్ , ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును ఏకి పారేశారు. తాజాగా చోటు చేసుకున్న తిరుపతి లడ్డూ కల్తీ వివాదంపై స్పందించారు. సీఎం చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అబద్దమని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఈ వివాదంపై విచారణ చేపట్టేందుకు గాను చంద్రబాబు నాయుడు సిట్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు . ఈ విచారణను గుంటూరు రేంజ్ ఐజీని నియమించినట్లు పేర్కొన్నారు.
దీనిపై తీవ్రంగా స్పందించారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. సిట్ తో కాకుండా దేశంలో పేరు పొందిన జాతీయ దర్యాప్తు సంస్థలతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు . ఈ మేరకు పీఎం మోడీ, భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్ కు లేఖలు కూడా రాశారు.
ఈ తరుణంలో బుధవారం ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు జగన్ రెడ్డి. తిరుమల పవిత్రతను,
స్వామివారి ప్రసాదం విశిష్టతను, వెంకటేశ్వర స్వామి వైభవాన్ని, టీటీడీ పేరు ప్రఖ్యాతులను, శ్రీవారి ప్రసాదమైన లడ్డూ పవిత్రతను రాజకీయ దుర్బుద్ధితో దుష్ప్రచారం చేశారంటూ ఆరోపించారు మాజీ సీఎం.
కావాలని అబద్ధాలాడారని ఆరోపించారు. జంతువుల కొవ్వుతో కల్తీ జరగనిది జరిగినట్టుగా, ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్టుగా, అసత్య ప్రచారంతో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు తిరుమలను, తిరుమల లడ్డూను, వేంకటేశ్వరస్వామి విశిష్టతను అపవిత్రం చేశారని మండిపడ్డారు.
చంద్రబాబు చేసిన ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో సెప్టెంబరు 28, శనివారం రోజున పూజల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.