మళ్లీ మనం అధికారంలోకి వస్తాం
జగన్ మోహన్ రెడ్డి ప్రజా దర్బార్
అమరావతి – ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా దర్బార్ చేపట్టారు. తాడేపల్లి గూడెంలోని తన నివాసంలో ఆయన ప్రజలను కలుసుకున్నారు. ఈ సందర్బంగా వారు సమర్పించిన వినతి పత్రాలను స్వీకరించారు.
ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఆయనను కలుసుకున్నారు. మరికొందరు తమ గోడు వినిపించారు. వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
కేవలం 3 శాతం తేడాతోనే వైసీపీ అధికారాన్ని కోల్పోయిందని ఈ సందర్బంగా వాపోయారు. అయినా ఎవరూ కూడా భయానికి గురి కావద్దని సూచించారు. వారికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.
రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక ప్రజలకు భద్రత లేకుండా పోయిందని ఆరోపించారు. ఇదే సమయంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా పక్కదారి పట్టిందని, రాష్ట్రంలో వెంటనే రాష్ట్రపతి పాలన విధించాల్సిన అవసరం ఉందని అన్నారు మాజీ సీఎం.
మన ప్రభుత్వం వస్తుందని, మీకంతా మేలు జరుగుతుందని, అప్పటి దాకా ఓపికతో ఉండాలని సూచించారు జగన్ రెడ్డి.