NEWSANDHRA PRADESH

ఏపీలో సాగుతున్న‌ రాక్ష‌స పాల‌న

Share it with your family & friends

నిప్పులు చెరిగిన మాజీ సీఎం జ‌గ‌న్

అమ‌రావ‌తి – ఏపీ మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నిప్పులు చెరిగారు. గురువారం ట్విట్ట‌ర్ ఎక్స్ వేదిక‌గా తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. లా అండ్‌ ఆర్డర్‌ అన్నది ఎక్కడా కనిపించడం లేదని ఆరోపించారు. ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని వాపోయారు.

వైయస్సార్‌సీపీని అణగ దొక్కాలన్న కోణంలో ఈ దారుణాలకు పాల్పడుతున్నారని ధ్వ‌జ‌మెత్తారు. కొత్త ప్రభుత్వం వచ్చి నెలన్నర రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్‌ అంటే హత్యలు, అత్యాచారాలు, రాజకీయ కక్షలతో చేస్తున్న దాడులు, విధ్వంసాలకు చిరునామాగా మారిపోయిందన్నారు.

నిన్నటి వినుకొండ హత్య ఘటన దీనికి పరాకాష్ట అని పేర్కొన్నారు. నడి రోడ్డుపై జరిగిన ఈ దారుణ కాండ ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు మాజీ సీఎం. ముఖ్యమంత్రి సహా బాధ్యతతో వ్యవహరించాల్సిన వ్యక్తులు రాజకీయ దురుద్దేశాలతో వెనక ఉంటూ ఇలాంటి దారుణాలను ప్రోత్సహించ‌డం దారుణ‌మ‌న్నారు.

ఎవరి స్థాయిలో వాళ్లు రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ, పోలీసు సహా యంత్రాంగాలన్నింటినీ నిర్వీర్యం చేశారని ఆరోపించారు జ‌గ‌న్ రెడ్డి. దీంతో నేరగాళ్లు, హంతకులు చెలరేగి పోతున్నారని మండిప‌డ్డారు.

అధికారం శాశ్వతం కాదని, హింసాత్మక విధానాలు వీడాలని చంద్రబాబును గట్టిగా హెచ్చరిస్తున్న‌ట్లు తెలిపారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలతో ప్రత్యేక విచారణ జరగాల్సిన అవసరం ఉందన్నారు.

రాష్ట్రంలో దిగజారిన శాంతిభద్రతల పరిస్థితులపై దృష్టి పెట్టాలని పీఎం మోడీకి, కేంద్ర మంత్రి అమిత్ షాకు విజ్ఞ‌ప్తి చేస్తున్న‌ట్లు తెలిపారు.