దాడుల పరంపర హత్యల జాతర
న్యూఢిల్లీలో వైఎస్ జగన్ ఆగ్రహం
ఢిల్లీ – వైసీపీ బాస్, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం కొలువు తీరాక దాడుల పరంపర కొనసాగడం, హత్యలు జరగడాన్ని తీవ్రంగా ఖండిస్తూ దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమానికి దేశంలోని వివిధ పార్టీలకు చెందిన నేతలు మద్దతు ప్రకటించారు.
ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ఎస్పీ చీఫ్, ఎంపీ అఖిలేష్ యాదవ్ బేషరతు మద్దతు ప్రకటించారు. జగన్ రెడ్డి చేస్తున్న పోరాటం న్యాయమైనదేనని అన్నారు. బుల్డోజర్ సంస్కృతికి తెర దించాలని అన్నారు అఖిలేష్ యాదవ్. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు. అధికారంలో ఉన్నామని దాడులు చేసుకుంటూ, హత్యలకు పాల్పడతారా అని ప్రశ్నించారు.
శివసేన పార్టీ తరపున ఎంపీలు సంజయ్ రౌత్ , ప్రియాంక చౌదరి సపోర్ట్ గా నిలుస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేకుండా పోయిందన్నారు. రాబోయే రోజుల్లోనూ జగన్ రెడ్డి చేసే ప్రతి కార్యక్రమానికి తాము మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా జగన్ రెడ్డి మాట్లాడుతూ తన న్యాయ పరమైన ధర్నాకు సంఘీభావం ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉన్నాయని అన్నారు. నారా లోకేష్ రెడ్ బుక్ రాశారని, అందులో పేర్కొన్నట్టుగానే పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.