బాబు అరాచక పాలన జగన్ ఆందోళన
రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ విఫలం
అమరావతి – ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ బాస్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో కొలువు తీరిన టీడీపీ కూటమి ప్రభుత్వం రాచరిక పాలన సాగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. లా అండ్ ఆర్డర్ పూర్తిగా అదుపు తప్పిందని అన్నారు. కావాలని కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు జగన్ మోహన్ రెడ్డి.
ప్రజలు తీవ్ర భయాందోళనకు లోనవుతున్నారని, ప్రధానంగా ప్రతి చోటా పనిగట్టుకుని వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులను , ప్రశ్నించే వారిని టార్గెట్ చేస్తూ దాడులకు దిగుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రతిపక్షం అన్నది లేకుండా చేయాలని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తున్నాడని మండిపడ్డారు జగన్ రెడ్డి.
కొడుకు నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాడని, పైకి నీతులు చెబుతూ లోలోపట దాడులకు ప్రేరేపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ సీఎం. ఈ ఐదేళ్ల పాటు మనకు కష్టాలు ఉంటాయని, కానీ అవి ఎల్లకాలం ఉండవని గుర్తు పెట్టుకోవాలన్నారు. 2029లో వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టం చేశారు జగన్ మోహన్ రెడ్డి.