యుద్దం తప్పదన్న జగన్ రెడ్డి
అమరావతి – మాజీ సీఎం జగన్ నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో కూటమి పాలన గాడి తప్పిందన్నారు. ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, ఏడు నెలలకే విసుగు చెందారని, ఇక రాబోయేది మన రాజ్యమేనని జోష్యం చెప్పారు. పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు అధైర్య పడవద్దని అన్నారు.
తాను త్వరలోనే రంగంలోకి దిగుతున్నానని, ఎవరు వస్తారో చూస్తానని హెచ్చరించారు. ఏ ఒకరిపైనా చేయి వేసినా చూస్తూ ఊరుకోనని అన్నారు. హామీల పేరుతో నిట్ట నిలువునా మోసం చేశారంటూ ధ్వజమెత్తారు.
గురువారం జగన్ మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రజల తరపున తాను యుద్దం చేసేందుకు సిద్దంగా ఉన్నానని ప్రకటించారు. తమ వారిపై దాడులకు పాల్పడితే చూస్తూ ఊరుకోనని అన్నారు. దావోస్ పర్యటనకు వెళ్లిన తండ్రీ కొడుకులు ఏం సాధించారో చెప్పాలని డిమాండ్ చేశారు మాజీ సీఎం.
కేవలం తమ ఇమేజ్ పెంచుకునేందుకు మాత్రమే వెళ్లారంటూ చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు. తమపై బురద చల్లడం తప్పితే ఏం చేశారో చెప్పాలన్నారు.